Sam Pitroda: శ్యామ్‌ పిట్రోడా రాజీనామా

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ... మండిపడ్డ బీజేపీ కీలక నేతలు

Update: 2024-05-09 01:00 GMT

లోక్ సభ ఎన్నికల వేళ తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, బీజేపీకి కొత్త అస్త్రాలను అందించడంతో శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే... వెంటనే ఆమోదించినట్లు AICCవర్గాలు తెలిపాయి. గతంలో వారసత్వ పన్ను అంశంపై... పిట్రోడా చేసిన వ్యాఖ్యలను భాజపా అస్త్రంగా మలుచుకోగా ఇవాళ దక్షిణ, ఈశాన్య, ఉత్తర భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

భగ్గుమన్న బీజేపీ

పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణికి నిదర్శమంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది. అవి జాత్యహంకార వ్యాఖ్యలని ఆరోపించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రూపురేఖలను బట్టి దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. చూడడానికి భిన్నంగా కనిపించినప్పటికీ మేమంతా భారతీయులం అని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్ లో పేర్కొన్నారు. తాను ఈశాన్య ప్రాంతానికి చెందినా భారతీయుడిలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు భారతీయుల వారసులుకాదని.. దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు.

పిట్రోడా ఏమన్నాడంటే..?

దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీయులు మాదిరిగా ఉంటారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడా కొన్నిసార్లు ఘర్షణ పడినా 75 ఏళ్లుగా భారతీయులు సంతోషకరమైన వాతావారణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు. ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన..తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన అరబ్బుల్లా, ఉత్తరాదిన తెల్లగా, దక్షిణాదిన ఆఫ్రికన్ల వలే కనిపిస్తారని చెప్పారు. ఎవరెలా ఉన్నా....... పెద్ద విషయం కాదన్న పిట్రోడా తామంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లమని పేర్కొన్నారు. గుజరాతీ అయిన తాను..దోశ, ఇడ్లీని ఇష్టపడతానని చెప్పిన ఆయన..... అవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారంకావన్నారు. తాము భాషలు, ఆచారాలు, ఆహారం, మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు. దేశ ప్రజల రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు..రాజకీయంగా పెను దుమారం రేపాయి.

Tags:    

Similar News