Ragging: ర్యాగింగ్ భూతానికి 51 మంది బలి
2022-24 మధ్య పరిస్థితులపై నివేదిక;
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం. సొసైటీ ఎగెనెస్ట్ వయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రచురించిన ‘భారత దేశంలో ర్యాగింగ్ పరిస్థితి, 2022-24’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ర్యాగింగ్ ఘటనలపై ఫిర్యాదులు అత్యధికంగా వైద్య కళాశాలల నుంచి వస్తున్నాయని తెలిపింది.
జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు 1,946 కళాశాలల నుంచి 3,156 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 38.6 శాతం వైద్య కళాశాలల నుంచి వచ్చాయి. ఈ ఫిర్యాదులు కేవలం హెల్ప్‌లైన్ ద్వారా నమోదైనవేనని, నేరుగా కళాశాలలు, పోలీసులకు బాధితులు చేసిన ఫిర్యాదులు ఇంకా ఎక్కువే ఉంటాయని ఈ నివేదిక రూపకర్తలు తెలిపారు. 2022-24 మధ్య రాజస్థాన్‌లోని కోటాలో 57 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కళాశాలలు యాంటీ ర్యాగింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ నివేదిక సూచించింది. ఈ స్కాడ్‌ను సంప్రదించేందుకు ఫోన్ నంబరు తదితర వివరాలను కొత్త విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది.