కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ కు ( Rahul Gandhi ) కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన సోదరి ప్రియాంకాగాంధీ ఈ బంగ్లాను చూసేందుకు రావడంతో దీనిపై వార్తలు మొదలయ్యాయి. ఇంటి విషయంలో రాహుల్ తన రిప్లైని ఇవ్వాల్సి ఉంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఎంపీగా విజయం సాధించారు. ఈసారి ఆయన లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అది క్యాబినెట్ ర్యాంకు హోదా కావడంతో టైప్ 8 బంగ్లాను పొందేందుకు ఆయన అర్హులు. టైప్ 8 బంగ్లాను క్యాబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.
గతేడాది పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడి లోక్సభలో అనర్హత వేటు పడటంతో రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు అనర్హతపై స్టే విధించింది. అప్పటి నుంచి 10 జనపద్ లోని తన తల్లి సోనియా గాంధీ నివాసంలోనే రాహుల్ ఉంటున్నారు.