rahul: "ఓట్ చోరీ"పై వెనక్కి తగ్గని రాహుల్‌గాంధీ
ఎన్నికల సంఘంపై రాహుల్‌గాంధీ యుద్ధం.. ఈసీకి ఎన్నికల కమిషన్‌కు 5 ప్రశ్నలు... దేశానికి ఈసీ సమాధానం చెప్పాలన్న రాహుల్;
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్ సైట్ మూసివేసిందన్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదయ్యాయని.. కర్ణాటకలో కూడా ఫేక్ ఓట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు. ఇదంతా ఓటర్లను మోసం చేయడానికి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఓటు దొంగతనం జరుగుతుందని హెచ్చరించారు. ‘‘రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకోగలమని మీరు అనుకుంటే… మీరు మరోసారి ఆలోచించాలి. మేము మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటాము. దీనికి సమయం పడుతుంది. కానీ మేము మిమ్మల్ని పట్టుకుంటాము’’ అని ఈసీకి వార్నింగ్ ఇచ్చారు.
అక్రమాలతోనే గెలుపు
"భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది" అని రాహుల్ అన్నారు.
ఈసీకి రాహుల్ ఐదు ప్రశ్నలు
డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?
సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?
నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?
ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?
బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?
స్పందించిన ఎన్నికల సంఘం
రాహుల్‌గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ చేసిన ఆరోపణలు అసంబద్ధ విశ్లేషణగా పేర్కొంది. తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు ఫిర్యాదు సమర్పించాలని.. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసింది. రాహుల్‌గాంధీ విశ్వసిస్తే.. డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇవ్వాలని కోరింది. ఒక వేళ డిక్లరేషన్‌పై సంతకం చేయకపోతే విశ్లేషణ, తీర్మానాలు అసంబద్ధమైనవిగా పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఓ డిక్లరేషన్‌పై సంతకం చేసి విడుదల చేయాలని రాహుల్ గాంధీకి తేల్చి చెప్పింది. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది. డిక్లరేషన్ విడుదల చేయకపోతే రాహుల్ గాంధీకి తన వ్యాఖ్యలపై నమ్మకం లేనట్టు భావించాల్సి వస్తుందని ఈసీ పేర్కొంది. కాబట్టి, పౌరులను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరింది. రాహుల్ గాంధీవి అసంబద్ధ ఆరోపణలని తోసి పుచ్చింది.