Rain in Bengal: డార్జిలింగ్‌లో వరుణ బీభత్సం.. 17కు చేరిన మృతుల సంఖ్య

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

Update: 2025-10-05 07:30 GMT

పశ్చిమబెంగాల్‌ లోని డార్జిలింగ్‌ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 17కు చేరింది. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాలసోన్‌ నదిపై దూదియా వద్ద సిలుగుడి-మరిక్‌ ప్రాంతాలను కలిపే ఇనుప వంతెన కుప్పకూలింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కలింపాంగ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. 717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో సిక్కిం-సిలిగుడి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. తీస్తా, మాల్‌ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

భూటాన్‌లో భారీ వర్షాలతో బెంగాల్‌కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు డార్జిలింగ్‌లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తూర్పు నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

ఇలామ్ జిల్లాలో ఐదుగురు మరణించగా.. పటేగాన్, మన్సేబుంగ్, డ్యూమా, ధుసుని, రత్మాటే, ఘోసాంగ్ ప్రాంతాలలో మరో తొమ్మిది మంది మరణించారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో హెలికాప్టర్‌లను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News