Rajasthan: లాటరీ టికెట్ కొనడానికి రూ.500 లు అప్పు.. అదృష్టం వరించి రూ.11 కోట్లు గెలుపు..

20 సంవత్సరాల నుంచి అతడు లాటరీ టికెట్లు కొంటున్నాడు.. కూరగాయలు అమ్మితే వచ్చే డబ్బులలో నుంచే లాటరీ టికెట్లు కొనడానికి కూడా ఖర్చు పెట్టేవాడు.. ఇంట్లో వాళ్లు వద్దంటున్నా ఎప్పటికైనా లాటరీ తగలక పోతుందా అదృష్టం మారకపోతుందా అని ఆశపడ్డాడు.. ఇక అదృష్ట దేవతకి కూడా విసుగు పుట్టినట్లుంది. ఇంక అతడి సహనాన్ని పరిక్షించకూడదనుకుందో ఏమో ఒకేసారి కోట్లు కుమ్మరించింది. రూ.11 కోట్లు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

Update: 2025-11-05 10:14 GMT

పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన దీపావళి బంపర్ లాటరీ 2025 రాజస్థాన్‌కు చెందిన సాధారణ కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది. జైపూర్ వీధుల్లో బండి మీద కూరగాయలు అమ్మి జీవితం గడుపుతున్న అమిత్ కి అదృష్టం వరించింది. లాటరీ ద్వారా తాను మొదటి బహుమతి ₹11 కోట్లు గెలుచుకున్నానని తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆనందంతొో కన్నీళ్లు కార్చాడు. పేదరికంలో మగ్గుతున్న అతడి ఆనందానికి అవధులు లేవు. 

మంగళవారం, అమిత్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చండీగఢ్‌లోని పంజాబ్ స్టేట్ లాటరీస్ కార్యాలయానికి వచ్చాడు, అక్కడ అతనికి బహుమతి డబ్బు కోసం 11 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ భావోద్వేగానికి గురయ్యాడు. లాటరీ కార్యాలయానికి చేరుకోవడానికి తన వద్ద డబ్బు కూడా లేదని, ఒక స్నేహితుడి నుండి అప్పు తీసుకుని వచ్చానని తెలిపాడు.

అమిత్ సెహ్రా గత 20 సంవత్సరాలుగా నిరంతరం లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు కానీ అంత పెద్ద జాక్‌పాట్ కొడతానని ఎప్పుడూ ఊహించలేదు. అమిత్ పంజాబ్‌లోని బతిండా నగరంలో ఈ టికెట్‌ను కొనుగోలు చేశాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బహుమతి ప్రకటించిన తర్వాత అమిత్‌ను సంప్రదించడం కష్టంగా మారింది. ఎందుకంటే లాటరీ టికెట్ కొనే సమయంలో అతను తన మొబైల్ నంబర్‌ను అందించాడు, కానీ తరువాత అతని మొబైల్ చెడిపోయింది, దీనివల్ల అతని నంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. లాటరీ విభాగం మరియు టికెట్ విక్రేత అతన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. చివరికి, అమిత్ స్వయంగా లాటరీ కార్యాలయానికి వచ్చి తన బహుమతిని పొందాడు.

ఈ ₹11 కోట్ల విజయం అమిత్ కు కేవలం డబ్బు మాత్రమే కాదు, తనకు, తన కుటుంబానికి కొత్త జీవితం లాంటిది. కూరగాయల బండి నడుపుతున్నప్పుడు పోలీసుల నుండి తరచుగా వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు తన బాధలన్నీ ముగిశాయని అమిత్ కన్నీళ్లతో పంచుకున్నాడు.

తన పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి బాగా చదివిస్తానని అన్నాడు. కొడుకు ఐఏఎస్ అధికారి అవుతానని చెప్పేవాడు. అతడి కలను నిజం చేస్తానని తెలిపాడు. ముందుగా కొంత డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను, ఆ తరువాత చిన్న వ్యాపారం ప్రారంభిస్తాను అని తెలిపాడు. 

అమిత్ హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. పంజాబ్ ప్రభుత్వానికి మరియు లాటరీ ఏజెన్సీకి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అమిత్ సెహ్రా కథ చూస్తే అదృష్టం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమిత్ ఈ లాటరీ బహుమతిపై దాదాపు ముప్పై నుండి 33 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడు నుండి మూడున్నర కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సి రావచ్చు అని లాటరీ కార్యాలయం తెలిపింది. 

Tags:    

Similar News