Rajasthan Election: ఎట్టకేలకు వసుంధర రాజెకు టికెట్
కాంగ్రెస్‌లో మార్పుల్లేవ్..;
రాజస్థాన్‌లో అధికారం చేపట్టమే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపాలు గెలుపుగుర్రాల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్....సీఎం అశోక్ గెహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌సహా 33మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. మరోవైపు భాజపా కూడా 83 మందితో రెండోజాబితా ప్రకటించింది. మాజీ సీఎం వసుంధర రాజే ఈ ఎన్నికల్లో పోటీ చేయటంపై నెలకొన్న సందిగ్ధానికి కమలనాథులు తెరదించారు.
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించగా భారతీయ జనతాపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మరో సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌సహా 33 మంది అభ్యర్థులతో హస్తం పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. పెద్దగా మార్పులు చేయకుండా అభ్యర్థులను ఖరారు చేసింది. ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సర్దార్‌పుర నుంచి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. స్పీకర్ సీపీ జోషికి కూడా తొలిజాబితాలోనే చోటు దక్కింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్‌లో ప్రధాన విపక్షమైన భాజపా 83మంది అభ్యర్థులతో రెండోజాబితా విడుదల చేసింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై నెలకొన్న సందిగ్ధానికి కమలదళం తెరదించింది. ఆమె తన సంప్రదాయ స్థానం ఝల్రాపటన్ నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక్కడి నుంచి ఆమె ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించారు. ఇక, మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్‌కు నాథ్‌ద్వారా స్థానం కేటాయించారు. మాజీ ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకి ఈసారి టికెట్ ఇవ్వకూడదని భావించిన భాజపా అధినాయకత్వం....పార్టీలో వ్యతిరేకత రావటంతో మనసు మార్చుకుంది. ఆయనకు చిత్తోర్‌గఢ్ స్థానం కేటాయించింది. రాజస్థాన్‌లో 200 శాసనసభ స్థానాలు ఉండగా....భాజపా ఇప్పటివరకు 124మంది అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లో వచ్చేనెల 25న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది