Rajasthan Elections : ముగిసిన ప్రచారపర్వం .. రేపే పోలింగ్
199 నియోజకవర్గాలకు ఒకే విడతగా పోలింగ్;
రాజస్థాన్ శాసనసభ సమరానికి సర్వం సిద్ధమైంది. 199 స్థానాలకు జరిగే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం....విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. 33జిల్లాల పరిధిలోని 199 స్థానాలకు జరిగే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.... కరణ్‌పుర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ ఆకస్మిక మరణం చెందటంతో ....అక్కడ ఎన్నిక వాయిదా పడింది. రాజస్థాన్‌లో మొతం 5కోట్ల 25 లక్షలా 38వేల నూటా 5మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2కోట్ల 73 లక్షల మంది పురుషులు, రెండు కోట్ల 51 లక్షల మంది మహిళలు, 803 మంది టాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇంకా 17వేల 2వందల 41 మంది....వందేళ్లు పైబడిన ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. వారికోసం కేంద్ర ఎన్నికల సంఘం 51వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో పట్టణ ప్రాంతాల్లో 10వేల 4వందల 15, గ్రామీణప్రాంతాల్లో 41వేల 3వందల41 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది.
రాజస్థాన్ శాసనసభ సమరంలో కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, సీపీఐ, నేషనల్ పీపుల్స్ పార్టీతోపాటు ఇతర చిన్నాచితక పార్టీలు, స్వతంత్రులు బరిలో ఉన్నాయి. అయితే హస్తం, కమలం పార్టీల మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది. వివిధ పార్టీల తరఫున దాదాపు 19వందల మంది అభ్యర్థులు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్....ఐదోసారి సర్దార్‌పుర నుంచి పోటీ చేస్తున్నారు. 1998 నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గహ్లోత్ ఇప్పటివరకూ నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్....టోంక్ నుంచి మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2018లో ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో గుర్జర్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉండగా....ఆ తర్వాత స్థానంలో మీనా, ముస్లిం ఓటర్లు ఉన్నారు. లచ్‌మన్‌గఢ్ నుంచి పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్ దోస్తారా బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన ఇప్పటికే నాలుగుసార్లు గెలుపొందారు. 2003లో ఒకసారి మాత్రమే భాజపా ఈ సీటును దక్కించుకుంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజె ఝల్రాపటన్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 2003 నుంచి ఆమె ఈ స్థానంలో గెలుపొందుతూ వస్తున్నారు.