CJI Gavai: గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు

ప్రతి రాత్రి దేవుడు నిద్ర‌లో నన్ను అడిగేవాడు..'- నిందితుడు రాకేష్ కిషోర్

Update: 2025-10-07 06:30 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై మరోసారి నిందితుడు రాకేష్ కిషోర్ పరుష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రవర్తించిన తీరుకు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనకెలాంటి భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో రాకేష్ కిషోర్ మాట్లాడుతూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మత్తులో ఉండి ఆ పని చేయలేదని.. తాను పూర్తిగా స్పృహలో ఉండే ఆ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. తానేమీ భయపడడం లేదని.. పైగా జరిగిన దానికి ఏ మాత్రం చింతించడం కూడా లేదని పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్‌లో విష్ణువు విగ్రహంపై విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. పిటిషన్ విచారిస్తూ ఎగతాళి చేయడమేంటి? వెళ్లి విగ్రహాన్ని ప్రార్థించు అంటూ ఎటకారంగా మాట్లాడతారా? దేశ సనాతన ధర్మానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించే తీరు ఇదేనా? గవాయ్ ఎగతాళి చేయడంతోనే తనకు కడుపు మండిందన్నారు. తాను దాడి చేసేటప్పుడు ఎలాంటి మత్తులో లేనని.. పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇటీవల గవాయ్ మారిషస్ పర్యటనకు వెళ్లి భారత రాజ్యాంగం గురించి ప్రసంగాలు చేయడమేంటి? అని నిలదీశారు. పైగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. బుల్డోజర్ చర్యను తప్పుపట్టారు. ఇది ఎంత వరకు కరెక్ట్.. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న వారిపై బుల్డోజర్ చర్య తీసుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. గవాయ్ మాటలతో తాను చాలా బాధపడ్డాను అన్నారు. దళితుడిపై దాడి జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు కదా? తన కులమేంటో మీకు తెలుసా? అని రిపోర్టర్‌ను ప్రశ్నించాడు. తాను కూడా ఒక దళితుడినే అని తెలిపాడు. అసలు అంత ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ఆ వ్యక్తికి.. అసలు ‘‘మిలార్డ్’’ అనే పదానికి అర్థం తెలుసా?, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది అని హితవు పలికారు. మారిషస్ వెళ్లి దేశం బుల్డోజర్ ద్వారా నడవదని వ్యాఖ్యానించడం ఏంటి? అని రాకేష్ కిషోర్ మండిపడ్డాడు.

‘‘గవాయ్ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. గవాయ్ మొట్టమొదట దళితుడు కాదు.. మొదట ఆయన సనాతన హిందూ. ఆ తర్వాతే తన విశ్వాసాన్ని త్యజించి బౌధమతాన్ని అనుసరిస్తున్నారు. బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నప్పుడు హిందూ మతం నుంచి బయటకు వచ్చానని చెప్పిన తర్వాత ఇంకా దళితుడు ఎలా అవుతాడని’’ అని రాకేష్ కిషోర్ ప్రశ్నించాడు.

గవాయ్‌పై దాడి చేయించింది దేవుడే అని తెలిపాడు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేశాడు.. సర్వశక్తిమంతుడి ఆదేశం మేరకు చర్యకు ప్రతిచర్య అని చెప్పుకొచ్చాడు. వెళ్లి నీ దేవుడిని అడుగు అని అనడం ఏంటి? అని గవాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను కూడా అన్ని మతాలను గౌరవిస్తానని రాకేష్ కిషోర్ వివరించాడు.

అసలేం జరిగిందంటే..

సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై వృద్ధా న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు. గవాయ్‌పై దాడిని ప్రధాని మోడీ సహా రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి.

ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్‌ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహంగా ఉన్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News