Brain-Eating Amoeba: అరుదైన వ్యాధితో కేరళ బాలుడి మృతి
అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి 15 ఏళ్ల బాలుడి మృతి.... కలుషిత నీటితో స్నానం చేయొద్దంటూ వైద్యుల సూచన...;
కేరళలో మరో అరుదైన వ్యాధి వెలుగు చూసింది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు బయటపడింది. పనవల్లికి చెందిన 15 ఏళ్ల బాలుడు కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి మరణించినట్లు అధికారులు ప్రకటించారు. పనవళ్లి అనే గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ షాలిని దంపతుల కుమారుడు గురుదత్ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల గురుదత్ స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం నుంచి అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి బాలుడు చనిపోయాడు.
బాలుడి మృతిపై స్పందించిన కేరళఆరోగ్యమంత్రి వీణా జార్జ్..ఇప్పటి వరకూ ఐదుగురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు. 2017లో అలప్పుజలో తొలి కేసు నమోదైంది. ఆ తరవాత 2019,20 లోనూ మలప్పురంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. 2020, 2022లో కజికోడ్, త్రిస్సూర్‌లో కేసులు నమోదయ్యాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఫిట్స్, మైకము ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వైద్యులు వెల్లడించారు.
ఆందోళన కలిగించే విషయం ఏంటంటే..ఈ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు బతికే అవకాశాలు అసలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న నీళ్లలో ఈ అమీబా పెరుగుతుందని, ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుందని వివరించారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రజలెవ్వరూ కలుషిత నీళ్లతో స్నానం చేయొద్దని సూచించారు.
పరాన్నజీవి లేకుండా నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా తరగతికి చెందిన వ్యాధి కారక క్రిముల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాలువలు, చెరువులు వంటి నీళ్లలో స్నానం చేయడం ద్వారా ముక్కు, సన్నని చర్మం ద్వారా ఈ క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కలుషితమైన నీటితో స్నానం చేయడం, మీ ముఖం, నోటిని అపరిశుభ్రమైన నీటితో కడగడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధికి ఇలాంటి పనులే కారణమవుతున్నాయి.. వర్షాకాలంలో ప్రవహించే నీళ్లు, కాలువలలో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.