RBI Shaktikanta Das : ఆర్‌బీఐ అలర్ట్..శక్తికాంతదాస్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్
డీప్‌ఫేక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేరిట డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం కలకలం రేపుతోంది. పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆర్‌బీఐ స్పందించింది. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్‌బీఐ కొన్ని పెట్టుబడి పథకాలు తీసుకొస్తోందని, ఫలానా పెట్టుబడి పథకంలో మదుపు చేయాలని సూచిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వ్యవహారం ఆర్‌బీఐ దృష్టికి రావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది. సదరు వీడియోలతో ఆర్‌బీఐ అధికారులకు సంబంధం లేదని, అవన్నీ ఫేక్ అని స్పష్టంచేసింది. ఆర్‌బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వబోదని గుర్తుచేసింది. గతంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా ఇదే తరహా అడ్వైజరీని జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ కొన్ని స్టాక్స్ ఇస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడంపై ఎన్‌ఎస్‌ఈ స్పందించింది. ఇలాంటి ఫేక్, ఏఐ జనరేటెడ్ వీడియోల బారిన పడొద్దని మదుపర్లకు సూచించింది