RBI Rules : జూలై 1 నుంచి కొత్త రూల్స్..ఎడాపెడా ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు ఇస్తామంటే బ్యాంకులకు కుదరదు.

Update: 2026-02-12 07:00 GMT

RBI Rules : బ్యాంకులకు వెళ్లినప్పుడు లోన్ కావాలని అడిగితే, దాంతో పాటు ఇన్సూరెన్స్ పాలసీలు, క్రెడిట్ కార్డులు అంటగట్టే రోజులకు ఇక చెక్ పడనుంది. కస్టమర్ల అభీష్టానికి వ్యతిరేకంగా ఉత్పత్తులను అమ్మే మిస్ సెల్లింగ్ వ్యవహారాలపై భారత రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంకులు అనుసరిస్తున్న డార్క్ ప్యాటర్న్స్, మోసపూరిత విక్రయ పద్ధతులపై కఠినమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. చాలా సందర్భాల్లో కస్టమర్లు కేవలం లోన్ కోసం లేదా సేవింగ్స్ అకౌంట్ కోసం బ్యాంకుకు వెళ్తారు. కానీ బ్యాంకు సిబ్బంది వారికి తెలియకుండానే ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా క్రెడిట్ కార్డులను అంటగడుతుంటారు. డిజిటల్ ఫామ్‌లలో ఒకే ఒక్క I Agree బటన్ నొక్కడం ద్వారా అన్ని రకాల సేవలకు అనుమతి తీసుకున్నట్టుగా బ్యాంకులు భ్రమింపజేస్తాయి. దీన్నే మిస్ సెల్లింగ్ అంటారు. ఇకపై ప్రతి ప్రొడక్ట్ కోసం విడివిడిగా, స్పష్టమైన సమ్మతి తీసుకోవాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది.

బ్యాంకింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లలో కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ వద్దని చెప్పే ఆప్షన్ చిన్నగా ఉండటం లేదా ఈరోజే ఆఖరి అవకాశం అంటూ ఒత్తిడి చేయడం వంటివి డార్క్ ప్యాటర్న్స్ కిందికి వస్తాయి. జూలై 2026 నుంచి బ్యాంకులు తమ యాప్స్ నుంచి ఇలాంటి మోసపూరిత ఫీచర్లను తొలగించాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బ్యాంకుల్లో కూర్చునే వారంతా బ్యాంకు ఉద్యోగులు కారు. చాలా మంది థర్డ్ పార్టీ ఏజెంట్లు ఉంటారు. వారు టార్గెట్ల కోసం కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, ఆ ఏజెంట్లకు ఇచ్చే ట్రైనింగ్, వారి ప్రవర్తనకు బ్యాంకే బాధ్యత వహించాలి. అలాగే ఏజెంట్లు తాము బ్యాంకు శాశ్వత ఉద్యోగులం కాదని కస్టమర్‌కు స్పష్టంగా చెప్పాలి. ఆఫీసు సమయాల్లో మాత్రమే కస్టమర్లకు కాల్స్ చేయాలి.

ఒకవేళ బ్యాంకు ఏదైనా ప్రొడక్ట్‌ను తప్పుడు సమాచారంతో మీకు అమ్మినట్టు నిరూపితమైతే, బ్యాంకు ఆ డబ్బును కస్టమర్‌కు తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా దీనివల్ల కస్టమర్‌కు ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే దానికి పరిహారం కూడా ఇవ్వాలి. ప్రతి విక్రయం జరిగిన 30 రోజుల్లోపు కస్టమర్ నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ఇకపై తప్పనిసరి. దీనిపై బ్యాంకులు ప్రతి ఆరు నెలలకోసారి ఆర్బీఐకి నివేదిక సమర్పించాలి.

Tags:    

Similar News