RBI: బ్యాంకుల్లోకి రూ.3.14 లక్షల కోట్ల రూ. రెండు వేల నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన.. 88 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి వచ్చాయని ప్రకటన;
మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల( 2,000 notes)ను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపిన నేపథ్యంలో భారీ ఎత్తున నోట్లు డిపాజిట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ వివరాలు తెలిపింది.
ఉపసంహరణ ప్రకటన నాటికి మార్కెట్ లో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 88 శాతం తిరిగి( 88% of Rs 2,000 notes) బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్( Reserve Bank of India) ప్రకటించింది. వీటి విలువ 3 లక్షల 14 వేల కోట్ల(Rs 3.14 lakh crore returned)ని తెలిపింది. ప్రస్తుతం 42 వేల కోట్ల విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్ లో చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.
వెనక్కి వచ్చిన రెండు వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, 13 శాతం నోట్ల మార్పిడి ద్వారా బ్యాంకులకు చేరినట్లు RBI పేర్కొంది. మార్చి 31 నాటికి 3 లక్షల 62 వేల( Rs 3.62 lakh crore)కోట్లు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్ లో చలామణీలో ఉన్నాయని తెలిపింది. 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఇంకా రెండు నెలలు గడువు ఉన్నందున ప్రజలు చివరి నిమిషంలో బ్యాంక్ లకు వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆర్బీఐ ప్రజలకు సూచించింది.
సెప్టెంబరు 30, 2023 వరకు అవకాశం ఉన్నందున రెండు వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ తెలిపింది. రూ.2వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి గరిష్ఠంగా 20 వేల రూపాయలు విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చు.
నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30లోపు రూ.2వేల నోట్లు అన్నీ వెనక్కు వచ్చేస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల చట్టబద్ధత మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రూ.2వేల నోట్ల డిపాజిట్ సమయంలో రూ. 50వేలు మించితే పాన్ కార్డు తప్పనిసరి అని వివరించారు. రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువగా ఉంటుందని శక్తికాంతదాస్ విశ్లేషించారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో కొరతను అధిగమించేందుకే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు.