Supreme Court: వీధి కుక్కల తీర్పుపై కీలక పరిణామం
స్టెరిలైజ్ చేసి.. రిలీజ్ చేయండి : సుప్రీంకోర్టు;
జంతు ప్రేమికులకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని గతంలో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. షెల్టర్లకు తరలించిన వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజాగా ఆదేశాలు ఇచ్చారు. రేబిస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మాత్రమే షెల్టర్‌లో ఉంచాలని తెలిపింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించొద్దని తెలిపింది. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే కుక్కలకు ఆహారం అందించాలని పేర్కొంది. మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక దాణాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టొద్దని హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఉల్లంఘనలపై చర్యలకు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. ఇక జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. దత్తత తీసుకున్నాక కుక్కలను తిరిగి వీధుల్లో వదిలివేయకూడదని హెచ్చరించింది.
ఈ నెల 11న జస్టిస్ జేబీ.పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. కుక్క కాట్లు, తద్వారా రాబీస్ వ్యాధులు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ తీర్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇండియా గేట్ దగ్గర నిరసనలు తెలిపారు. అంతేకాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు చీఫ్ జస్టిస్‌కు లేఖలు కూడా రాశారు. దీంతో గవాయ్.. తీర్పును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా గతంలో ఇచ్చిన తీర్పును సవరించింది.