ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ డా. ఉషా కిరణ్ ఖాన్ (Usha Kiran Khan) బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న తుదిశ్వాస విడిచారు. డాక్టర్ ఉషా కిరణ్ ఖాన్ హిందీ, మైథిలీ భాషలలో ప్రముఖ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె మైథిలీ నవల ' భామతి: ఏక్ అవిస్మరణీయ ప్రేమకథ' కోసం సాహిత్య అకాడమీ అవార్డుతో సహా ప్రశంసలు పొందారు. ఆమె వయసు ప్రస్తుతం 79.
ఉషాకిరణ్ ఖాన్ మృతిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) స్పందించారు. తన సంతాపాన్ని తెలియజేశారు. “ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ ఉషా కిరణ్ ఖాన్ మరణం విచారకరం. ఆమె ప్రముఖ సాహితీవేత్త, రచయిత్రి. ఆమె మరణం హిందీ, మైథిలీ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. మరణించిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మాజీ IPS అధికారి రామచంద్ర ఖాన్ భార్య అయిన డాక్టర్ ఉషా కిరణ్ ఖాన్.. వాస్తవానికి బీహార్‌లోని లహెరియాసరాయ్‌కు చెందినవారు. కాగా తాజాగా ఆమె అనారోగ్యంతో పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 7, 1945న జన్మించిన ఉషా కిరణ్ ఖాన్ హిందీ, మైథిలీ భాషలకు ఆమె చేసిన అసమానమైన కృషికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకుంది.
2011లో ఆమె మైథిలి నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరుసటి సంవత్సరం, 2012లో, ఆమె తన నవల 'సిర్జన్‌హార్' కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుండి కుసుమాంజలి సాహిత్య సమ్మాన్‌ని అందుకుంది. 2015లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో మరింత గుర్తింపు పొందింది.