Zakir Hussain: త‌బ‌లా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ అస్తమయం

జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణాన్ని ధ్రువీక‌రించిన కుటుంబ స‌భ్యులు;

Update: 2024-12-16 02:45 GMT

ప్ర‌ఖ్యాత‌ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. గుండె, ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ల కారణంగా హుస్సేన్ మరణించిన‌ట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత‌ ఆదివారం రాత్రి ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, వాటిని కుటుంబ స‌భ్యులు ఖండించారు. ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉండ‌డంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న మ‌ర‌ణాన్ని ధ్రువీక‌రించారు.

జాకీర్‌ హుస్సేన్‌కు భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తెలు అనిసా ఖురేషీ, ఇసాబెల్లా ఖురేషీ ఉన్నారు. 1951 మార్చి 9న జన్మించిన ఆయ‌న‌ లెజెండరీ త‌బలా వాయిద్య‌కారుడు ఉస్తాద్ అల్లారఖా పెద్ద కుమారుడు. ఇక త‌బ‌లా మ్యాస్ట్రోగా పేరుగాంచిన జాకీర్ హుస్సేన్ ఏడు సంవత్సరాల వయస్సులోనే త‌న కెరీర్‌ను ప్రారంభించ‌డం విశేషం. త‌ద్వారా చిన్న‌ప్ప‌టి నుంచే తండ్రి బాట‌లో న‌డిచారాయ‌న‌.

హిందుస్థానీ క్లాసిక‌ల్ మ్యూజిక్‌, జాజ్ ఫ్యూజ‌న్‌లో ప్రావీణ్యం సాధించి సంగీత ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న‌ తన కెరీర్‌లో రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మతో సహా భారతదేశపు దిగ్గజ క‌ళాకారులందరితో కలిసి పనిచేశారు. యో-యో మా, చార్లెస్ లాయిడ్, బేలా ఫ్లెక్, ఎడ్గార్ మేయర్, మిక్కీ హార్ట్, జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీత విద్వాంసులతో ఆయ‌న క‌లిసి పనిచేయ‌డం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప‌రిచ‌యం చేశారు.

జాకీర్ హుస్సేన్ తన కెరీర్‌లో నాలుగు గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో మూడు అవార్డులను కైవ‌సం చేసుకున్నారు. అలాగే భార‌త ప్ర‌భుత్వం ఇచ్చే దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలు ఆయ‌న‌ను వ‌రించాయి. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌లను అందుకున్నారు.

Tags:    

Similar News