Atishi Resigns: ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో సీఎం అతిశీ రాజీనామా
సైలెంట్‌గా వెళ్లిపోయిన అతిషీ;
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో సీఎం అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సమర్పించారు. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆమె ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు. అతిశీ రాజీనామాను ఆమమోదించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మేరకు ఆమెను ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరారు.
ఢిల్లీలో అతిశీ (43) గత ఏడాది సెప్టెంబరు 21న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొన్న వేళ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అతిశీని శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకుని, ఆమెను సీఎంను చేసింది.
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తరువాత అతిశీ ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, ఢిల్లీలో 2020లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 62 సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మాత్రం కేవలం 22 సీట్లకే పరిమితం అయింది.
బీజేపీ 48 సీట్లతో విజయ ఢంకా మోగించింది. అతిశీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి వారు ఓడిపోయారు. త్వరలోనే సీఎంగా బీజేపీ నేతల్లో ఒకరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్‌ను ఆయన 4,089 ఓట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ప్రవేశ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే.