Jammu And Kashmir ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి

మసీద్‌లో ప్రార్థనలు చేస్తుండగానే ..

Update: 2023-12-24 06:00 GMT

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్‌ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్‌ సందర్భంగా మసీదులో మహ్మద్‌ షఫీపై కాల్పులు జరుపడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు. ఇటీవల లోయలో పోలీసులు, బలగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుల్వామాతో పాటు జమ్మూకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో పాటు ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గత నెలలో శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ స్థానిక యువకులతో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీరులో తరచూ ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఉగ్రవాదుల చొరబాట్లతోపాటు వారి సంచారం పెరగడంతో కేంద్ర భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలింపును ముమ్మరం చేశాయి. 

Tags:    

Similar News