RG Kar Medical College: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని మృతి.. లవర్‌పై మృతురాలి పేరెంట్స్ ఆరోపణ..

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి..

Update: 2025-09-14 04:30 GMT

 పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. మృతురాలు మాల్డాలో ఉండగా, ఆమెకు కాబోయే భర్త మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మృతురాలు స్వస్థలం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బాలూర్‌ఘాట్ వాసి. ఆమె తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. తమ కుమార్తె మరణం అసహజమైందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె మరణానికి కాబోయే భర్త కారణమని ఆరోపించారు. ఇద్దరికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయినప్పటికీ తన కూతురు అతడిని పెళ్లి చేసుకోకూడదని కోరుకున్నట్లు తల్లి చెప్పింది. యువతి మరణంపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.

ప్రాథమిక దర్యాప్తులో ఒక మెడిసిన్ మోతాదుకు మించి వాడటం వల్ల మరణించినట్లు తెలుస్తోందని, పోస్టుమార్టం నివేదిక, విసెరా నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తోందని మాల్డా జిల్లా పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం, యువతికి కాబోయే భర్త పరారీలో ఉన్నాడు.

‘‘ఇటీవల ఇద్దరూ పూరీ ఆలయానికి వెళ్లి అక్కడే వివాహం చేసుకున్నారు. నా కుమార్తె గర్భవతి. నేను ఆమెను, అతడిని వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చాను. నా కుమార్తె అంగీకరించింది. కానీ అతను దానిని నివారించేందుకు ప్రయత్నించాడు. బదులుగా నా కుమార్తెకు గర్భస్రావం చేయించడానికి బలవంతం చేశాడు.’’ అని మృతురాలి తల్లి చెప్పింది.

నాలుగు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి తన కుమార్తె మాల్డా వెళ్లినట్లు ఆమె పేరెంట్స్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు వారు చెప్పారు. తాము ఆస్పత్రికి వెళ్లే సరికి తమ కుమార్తె చనిపోయిందని, తన కుమార్తె హత్యకు గురైనట్లు, కాబోయే భర్త విషమిచ్చి తమ కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపించారు. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.

Tags:    

Similar News