Mumbai Studio Hostage: కిడ్నాపర్‌ని కాల్చి చంపిన పోలీసులు.. 20 మంది చిన్నారులు సేఫ్

ఆర్ఏ స్టూడియోలో ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను బంధించిన వ్యక్తి

Update: 2025-10-31 01:45 GMT

 ముంబైలో ఓ వ్యక్తి చిన్నారులను బందీలుగా చేసుకోవడం కలకలం రేపింది. ఆర్‌ఏ స్టూడియోలో ఆడిషన్స్‌ కోసం వచ్చిన 17 మంది చిన్నారులను రోహిత్‌ ఆర్య అనే వ్యక్తి నిర్బంధించాడు. పోలీసులు 35 నిమిషాలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరు పెద్దలతోసహా బందీలుగా ఉన్న పిల్లలందరినీ సురక్షితంగా రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌ సమయంలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన నిందితుడు రోహిత్‌ ఆర్యను దవాఖానకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించారు.ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్‌ స్టూడియోలో రోహిత ఆర్య గత నాలుగు రోజులుగా ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 8-14 ఏళ్ల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులు స్టూడియోకు వచ్చారు. రోహిత్‌ వారిలో కొంత మందిని మాత్రం బంధించాడు. దీంతో భయాందోళనలకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం అరిచారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగి రెస్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడికి సర్దిచెప్పేండుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. దీంతో అప్రమత్తమైన రెస్క్యూబృందం బాత్‌రూం ద్వారా లోనికి ప్రవేశించి 17 మంది చిన్నారులు సహా 19 మందిని సురక్షితంగా రక్షించారు. ఆ సమయంలోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఎయిర్‌గన్‌, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్‌ఏ స్టూడియో ఉద్యోగి అయిన ఆర్య పిల్లలను బంధించిన తర్వాత అధికారులతో తాను మాట్లాడదలచుకుంటున్నట్లు ఓ వీడియో సందేశం పంపాడు. కొందరు వ్యక్తులతో మాట్లాడాలన్న తన డిమాండును తీర్చకపోతే ఇద్దరు పెద్దలతోపాటు 15 మంది పిల్లలను బందీలుగా ఉంచిన భవనాన్ని పేల్చివేస్తానని ఆర్య బెదిరించినట్లు అధికారులు చెప్పారు. తాను ఉగ్రవాదిని కానని, పిల్లలను విడుదల చేయడానికి తాను భారీ మొత్తంలో డబ్బును కోరడం లేదని ఆర్య తన వీడియోలో చెప్పాడు. తాను కొందరు అధికారులతో మాట్లాడదలచానని, అందుకు ఏర్పాట్లు చేయాలని అతను కోరాడు. అయితే బందీలను విడిపించేందుకు పోలీసులు చర్చలు ప్రారంభించగా ఆర్యనే ముందుగా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆర్యపై ఎదురుకాల్పులు జరిపి గాయపరిచారు.

రోహిత్‌ ఆర్య పుణె నివాసి అని వెల్లడైంది. దీపక్‌ కేసరర్‌ మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖకు సంబంధించిన పాఠశాల పనికి అతనికి టెండర్‌ వచ్చింది. కానీ ఆ పనికి తనకు ఇంకా డబ్బు అందలేదని రోహిత్‌ ఆర్య ఆరోపించారు. కేసరర్‌ మంత్రిగా ఉన్నప్పుడు రోహిత్‌ ఆర్య తరచుగా తన నివాసం వెలుపల నిరసన తెలిపాడని అంటున్నారు. దీనిపై శివసేన నాయకుడు, మాజీ మంత్రి దీపక్‌ కేసరర్‌ మాట్లాడుతూ.. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోహిత్‌ ఆర్యకు రావాల్సిన డబ్బుకు సంబంధించిన చెకు వ్యక్తిగతంగా చెల్లించానని ఒక వార్తా ఛానెల్‌కు తెలిపారు.

Tags:    

Similar News