Nirmala Sitharaman : దేవుడిని నమ్మితేనే ఒత్తిడిని జయించొచ్చు.. నిర్మలా సీతారామన్
తీవ్రంగా మండిపడుతోన్న నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు;
పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పని ఒత్తిడి గురించి మాట్లాడకుండా, దేవుడి కృపతోనే ఒత్తిడిని జయించవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ‘మన పిల్లలు విద్య కోసం కళాశాలలు, యునివర్సిటీలకు వెళ్లి అద్భుతంగా బయటకు వస్తారు.
సీఏ చదివి ఓ సంస్థలో పని చేస్తున్న మహిళ పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్టు రెండుమూడు రోజుల క్రితం మాకు వార్త వచ్చింది. మీరు ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా ఒత్తిడిని తట్టుకునే మనోబలం ఉండాలి. దైవత్వంతోనే దీనిని సాధించవచ్చు. దేవుడిపై విశ్వాసాన్ని ఉంచండి. దీని ద్వారా మీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగేతే మనోబలం సాధించవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ‘విద్యాసంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు మనోబలం వస్తుంది. ఇదే వారి పురోగతికి, దేశ పురోగతికి ఉపయోగపడుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ‘కఠినమైన సీఏ డిగ్రీని చదవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే మనోబలం అన్నాకు ఉంది. ఆమె ప్రాణాలు తీసిన విషపూరితమైన పని సంస్కృతి, అధిక పని గంటల గురించి మాట్లాడాలి. బాధితురాలిని నిందించడం ఆపండి’ అంటూ నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల రోజూవారీ కష్టాలను నిర్మల అవమానిస్తున్నారని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ విమర్శించారు. అన్నా మరణానికి కారణమైన సమస్యలపై మాట్లాడకుండా దేవుడిని నమ్ముకోండని సలహా ఇవ్వడం వింతగా ఉందని, ఇది కఠినమైనదని పేర్కొన్నారు. నెటిజన్లు సైతం నిర్మల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.
బాధితురాలిని నిందించలేదు: నిర్మల
తన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. బాధితురాలిని నిందించడం తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఎవరి పేర్లూ తీసుకోలేదు. నేను మాట్లాడిన యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల మనోబలం పెంచుకోవడానికి ఇది ఎంత అవసరమనే దాని గురించే నేను మాట్లాడాను’ అంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు.