Karnataka: మాజీ అటెండర్ ఇంట్లో 30 కోట్ల ఆస్తులు బట్టబయలు!

నెల జీతం 15 వేలు.. లోకాయుక్త సోదాల్లో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, బంగారం, వెండి స్వాధీనం..;

Update: 2025-08-01 05:15 GMT

 కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో అటెండర్ గా పని చేసిన కలకప్ప నిడగుండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో రూ.30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 24 నివాస గృహాలు, 40 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరు మీదనే కాకుండా అతని భార్య, ఆమె సోదరుడి పేర్లతో కూడా రిజిస్టర్ చేయించినట్లే సోదాల్లో తేలింది. అలాగే, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోగ్రాముల వెండి, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఉద్యోగి కలకప్ప నిడగుండి నెలకు రూ.15,000 జీతంతో పని చేశాడు. మాజీ KRIDL ఇంజనీర్ ZM చిన్చోల్కర్‌తో కలిసి, 96 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులను సృష్టించడం ద్వారా రూ. 72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక, తమకు వచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో తనిఖీ చేయగా.. మాజీ అటెండర్ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడటం జరిగింది అన్నారు. ఇక, కొప్పల్ ఎమ్మెల్యే కె. రాఘవేంద్ర హిట్నాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది.. అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా సమగ్ర విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News