RSS chief : మణిపూర్ హింసాకాండలో తీవ్రవాదుల ప్రమేయం?
హింసకు బయటి శక్తులే కారణమన్న మోహన్ భగవత్;
మణిపూర్ హింసాకాండలో సరిహద్దు వెంబడి ఉన్న తీవ్రవాదుల ప్రమేయం ఉందేమో అని అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుమానం వ్యక్తం చేశారు. మణిపూర్ హింసాకాండకు బయటి శక్తులే కారణమని ఆరోపించారు. మణిపూర్ హింసను కొందరు ప్రేరేపించారని, ఈశాన్య రాష్ట్రం భగ్గుమనేందుకు వారే కారణమని అన్నారు. చాలా కాలంగా అక్కడ మైతీలు, కుకీలు కలిసిమెలసి బతుకుతున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టి అంతర్యుద్ధంలో ఎవరు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రశ్నించారు. అక్కడ జరిగిన విషయంలో బయటి శక్తులు ఉన్నాయని, హింసాకాండను రేపి అవి చలి కాచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
నాగపూర్‌లో ఆరెస్సెస్ దసరా ర్యాలీని ఉద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధనా రంగంలో తమ పట్టును ఉపయోగించుకుని దేశ విద్యా వ్యవస్ధను, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. తమ మతతత్వ ప్రయోజనాలను కోరుకునే ఈ స్వార్థ, వివక్ష, మోసపూరిత శక్తులు సామాజిక ఐక్యతకు విఘాతం కలిగించడానికి, సంఘర్షణను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడురోజు పాటు మకాం వేశారని, ఈ ఘర్షణలను కొందరు ప్రేరేపించారని, అసలు ఇది జరిగింది కాదని, పనిగట్టుకుని కొందరు హింస చెలరేగేలా వ్యవహరించారని మోహన్ భగవత్ ఆరోపించారు. శాంతి నెలకొంటుందనుకున్న సమయంలో కొన్ని ఘటనలు మళ్లీ జరిగాయని, ఇది ఇరు వర్గాల మధ్య దూరం పెంచాయని పేర్కొన్నారు. వారు మీడియా, విద్యారంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విద్య, సంస్కృతి, రాజకీయాలు, సామాజిక వాతావరణాన్ని గందరగోళం, గందరగోళం, అవినీతిలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. దేశ ఐక్యత, సమగ్రత, అస్తిత్వం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఓటు వేయాలని కోరారు.