Russian Woman: గుహల లోనే బిడ్డకు జననం.. అడవిలో ఆధ్యాత్మిక జీవితం

రష్యా మహిళ నీనా గురించి వెలుగులోకి కీలక విషయాలు;

Update: 2025-07-17 02:15 GMT

కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని ఓ గుహలో ఇద్దరు పిల్లలతో కనిపించిన రష్యన్‌ మహిళ నీనా కుటినా అలియాస్‌ మోహి (40) గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని ఓ గుహలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత నగర ప్రాంత గందరగోళానికి దూరంగా, గుహలో పూజలు, ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఏకాంతంలో గడిపారు. ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ వంటివాటిని తినేవారు. పాములు శత్రువులు కాదని, మిత్రులని చెప్తున్నారు.

 భర్త ఇజ్రాయెలీ బిజినెస్‌మ్యాన్‌

నీనా భర్త ఇజ్రాయెలీ బిజినెస్‌మ్యాన్‌ డ్రోర్‌ గోల్డ్‌స్టీన్‌. ఆయన క్లాత్‌ బిజినెస్‌ చేస్తున్నారు. బిజినెస్‌ వీసాపై ఆయన భారత్‌కు వస్తూ ఉంటారు. ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. గోల్డ్‌స్టీన్‌ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, నీనా కుటినాను ఎనిమిదేళ్ల క్రితం తాను గోవాలో కలిసి, ఆమెతో ప్రేమలో పడ్డానన్నారు. తమకు ప్రేయ (6) అమ (4) జన్మించారని చెప్పారు. తాము భారత్‌లో ఏడు నెలలు కలిసి ఉన్నామని, ఎక్కువ కాలం ఉక్రెయిన్‌లో ఉన్నామని తెలిపారు. గడచిన నాలుగేళ్లలో తాను తన కుమార్తెలను చూడటం కోసం భారత్‌కు తరచూ వస్తున్నానని చెప్పారు. తనకు చెప్పకుండానే ఆమె కొద్ది నెలల క్రితం పిల్లలిద్దర్నీ తీసుకుని గోవా నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అనంతరం వారు గోకర్ణలో ఉన్నట్లు తెలిసిందన్నారు. తాను తన కుమార్తెలను చూసేందుకు వెళ్లానని, వారితో ఎక్కువసేపు గడిపేందుకు నీనా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తన కుమార్తెలిద్దరినీ తనకు కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు. తాను నీనాకు ప్రతి నెలా ‘మంచి మొత్తంలో సొమ్ము’ను పంపిస్తున్నానని చెప్పారు. తన కుమార్తెలను రష్యాకు తీసుకెళ్లిపోతే, తనకు చాలా బాధగా ఉంటుందని, అందువల్ల వారిని దేశం నుంచి పంపించేయవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు.

నీనాను ఎలా గుర్తించారంటే..

కర్ణాటకలోని ఉత్తర కన్నడ, రామతీర్థ అడవిలో ఇటీవల కొండచరియ విరిగిపడటంతో రొటీన్‌ గస్తీలో భాగంగా పోలీసులు ఈ నెల 11న గుహ వద్దకు వెళ్లారు. అక్కడ చీరలు, ఇతర బట్టలను గమనించారు. వెంటనే మరింత ముందుకు వెళ్లి చూసేసరికి నీనా, ఆమె ఇద్దరు కుమార్తెలు గుహలో కనిపించారు. ఆమెను ప్రశ్నించినపుడు తన పాస్‌పోర్టు, వీసా పోయాయని చెప్పారు. అయితే, వాటిని గుహ సమీపంలోనే పోలీసులు గుర్తించారు. ఆమె బిజినెస్‌ వీసాపై 2016లో భారత్‌కు వచ్చినట్లు వెల్లడైంది. ఆమె వీసా గడువు 2017 ఏప్రిల్‌ 17న ముగిసింది. గోవా, గోకర్ణలలో ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడిన తర్వాత తిరిగి రష్యాకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు వెళ్తే అధికారులు గుర్తిస్తారనే భయంతో, గుహలు, మారుమూల ప్రాంతాలు, అడవుల్లో గడిపేవారు.

Tags:    

Similar News