Kanpur: పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌..

తృటిలో తప్పిన పెను ముప్పు;

Update: 2024-09-22 07:00 GMT

 రైలు పట్టాలపై మినీ గ్యాస్‌ సిలిండర్‌ కలకలం రేపింది. రైలు పట్టాలు తప్పాలనే కుట్రతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. రైల్వే ట్రాక్‌పై సిలిండర్‌ అమర్చిన ఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకొంది. ప్రేమ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఢిల్లీ – హౌరా రైల్వే ట్రాక్‌పై దీన్ని గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను గుర్తించే సమయానికి లూప్‌లైన్‌లో కాన్పూర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒక గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దారిచ్చే క్రమంలో దాన్ని ఆపారు. అదే సమయంలో లోకోపైలట్‌ ట్రాక్‌పై సిలిండర్‌ను గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

గత ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగుచూశాయని రైల్వేశాఖ తెలిపింది. కొందరు దుండగులు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి, రైళ్లకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రకటించింది. గత ఏడాది జూన్ నుంచి ఈ తరహాలో 24 ఘటనలు జరిగాయని భారత రైల్వే నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ తర్వాత పంజాబ్‌, జార్ఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడ్డాయి.

ఇలాంటి దుశ్యర్యలవల్లనే ఆగస్టులో కాన్పూర్‌ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ట్రాక్‌పై ఉంచిన ఓ వస్తువు కారణంగా ప్రమాదం జరగిందని తేలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మరోసారి కాన్పూర్‌, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోను ఈ ఘటనలు వెలుగుచూశాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది.

దాంతో ట్రాక్‌పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్‌.. వెంటనే అత్యవసర బ్రేకులు వేశారు. అయినప్పటికీ రైలు ఆ సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు కొంత దూరంలో ఎగిరిపడింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. లోకోపైలట్, రైల్వే గార్డు దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్‌తోపాటు ఒక పెట్రోల్‌ బాటిల్, అగ్గిపెట్టె, నాలుగు గ్రాముల పేలుడు పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అజ్మీర్‌ సమీపంలోని పట్టాలపై సిమెంట్ ఇటుకలను అధికారులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి పట్టాలు తప్పించే కుట్రలు ఎంతో కాలం సాగవని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఇప్పటికే వీటిపై దర్యాప్తును తీవ్రం చేశామని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని షా హెచ్చరించారు.

Tags:    

Similar News