Rajasthan Polls: సీఎం పదవిపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
కలిసి పోరాడతామన్న సచిన్ పైలట్.;
రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ తలపడుతుండగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవిపై సచిన్ పైలట్ స్పందించారు. ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్, మాజీ మంత్రి సచిన్ పైలట్ ఐక్యతారాగం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్ణయించినవారే నాయకత్వ పగ్గాలు చేపడతారని సచిన్ తాజాగా కామెంట్ చేశారు. ఉమ్మడి నాయకత్వం పట్ల పార్టీ మొగ్గుచూపుతుందని, పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలనేది అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.
తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, మెజారిటీ సీట్లు సాధించిన అనంతరం ఎమ్మెల్యేలతో చర్చించిన మీదట హైకమాండ్ పదవులపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పార్టీ నాయకత్వంతో చర్చించి పరిష్కరించుకోవచ్చని పైలట్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమను ఆశీర్వదించి పాలనా పగ్గాలు అప్పగిస్తే అందరం కూర్చుని ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
"ఎన్నికల్లో కాంగ్రెస్దృష్టి అంతా గెలుపుపైనే ఉంటుంది. మేం మా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించం. గెలిచాక నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో హైకమాండ్ కి తెలుసు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అధిష్టానంతో మాట్లాడి పరిష్కరించుకుంటాం. అది మా సంప్రదాయం, విధానం, చరిత్ర, నాయకత్వ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తప్పకుండా ఉంటుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థాయిలోనే ఈ సారి కూడా విజయం సాధిస్తాం. కానీ మెజారిటీ సాధించడంపై దృష్టి పెట్టాం" అన్నారు.
2018లో ఇదే విధానం అనుసరించామని, ఇప్పుడు కూడా దీన్నే అనుసరిస్తామని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కాగా రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్ లో హ్యాట్రిక్ సృష్టిస్తుంది' అని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ రంగంలోకి దిగారు. ఆయన ప్రస్తుతం అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ(BJP) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అజిత్ సింగ్ మెహతా బరిలో నిలిచారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.