SAD: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
మహారాష్ట్రలో పరువు హత్య కలకలం... 25 ఏళ్ల దళిత యువకుడు సక్షమ్ హత్య... అంత్యక్రియల రోజు యువతి సంచలనం
మహారాష్ట్రలో జరిగిన ఓ పరువు హత్య వ్యవహారం హృదయవిదారకంగా ముగిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఓల్డ్ గంజ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల దళిత యువకుడు సక్షమ్, ఆంచల్ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో.. కులాలు వేరు కావడంతో పరువు పోతుందని భావించిన ఆంచల్ తండ్రి, సోదరుడు మరో ముగ్గురు బంధువులతో కలిసి నవంబర్ 27న సక్షమ్ను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సక్షమ్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రాణాలు విడిచాడు. అయితే సక్షమ్ అంత్యక్రియల రోజు ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. "అతడు జీవించి ఉన్నా, చనిపోయినా నా భర్తే" అంటూ మృతదేహానికి కుంకుమ రాసి, మంగళసూత్రం ధరించి, సింధూరం పూసుకుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సక్షమ్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, వారి కోడలిగా ఇక్కడే ఉంటానని ప్రకటించింది. సక్షమ్ తల్లి ఆంచల్ను కూతురిలా ఆలింగనం చేసుకుని ఆదరించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తమకు నాకు న్యాయం కావాలని, హంతకులకు ఉరిశిక్ష పడాలి, అప్పుడే తన భర్త ఆత్మ శాంతిస్తుందని ఆ యువతి అధికారులను కోరింది.
అసలేం జరిగిందంటే..?
స్థానిక జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్, ఆంచల్ మామిడివార్ ప్రేమించుకున్నారు. ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు.. సక్షం టేట్ను హెచ్చరించారు. తర్వాత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు సాహిల్, హిమేష్, తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సక్షం టేట్ను హత్య చేశారు. అయితే ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా, బతికున్నా అతడే తన భర్తని పేర్కొన్న ఆంచల్.. సక్షం టేట్ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని తెలిపింది.