Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోల హతం..
ఒకరిపై రూ.కోటి రివార్డ్
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో అనేక మంది మావోలను అంతమొందించారు. లొంగిపోండి.. లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే మావోలకు కేంద్రం సూచించింది. అంతేకాకుండా లొంగిపోతే ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది.
తాజాగా సోమవారం ఉదయం జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఒకరిపై కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన సహదేవ్ సోరెన్, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సహదేవ్ సోరెన్ మృతిచెందాడు.
గోర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంటిత్రి అడవిలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన సహదేవ్ సోరెన్ స్క్వాడ్‌తో భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సంఘటనాస్థలి నుంచి సహదేవ్ సోరెన్‌తో పాటు మరో ఇద్దరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.