పదేళ్ల నుంచి ఒకే పాత్ర.. చివరికి ఆ పాత్ర వేస్తూనే వేదికపై కుప్పకూలి..
మరణం ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మాట్లాడుతూనే మరలి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు.;
మరణం ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మాట్లాడుతూనే మరలి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అప్పటి వరకు మన మధ్యలోనే ఉన్నట్టు ఉంటారు. అంతలోనే అంతర్ధానమైపోతారు. ఏ అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుండి గుండెపోటుకు గురై తనువు చాలించే కేసులు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.
జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రామ్ లీలాలో భగవాన్ పరశురాముడి పాత్రను పోషిస్తున్న ఒక కళాకారుడు వేదికపై హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు నిర్వాహకులు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కళాకారుడు వినోద్ ప్రజాపతి గత 10 సంవత్సరాలుగా ఈ పాత్రను పోషిస్తున్నారు. నటన పట్ల ఆయనకున్న అభిరుచి, మక్కువ ఆ ప్రాంతంలోని వారికి సుపరిచితమే.
ప్రదర్శన సమయంలో, రామాయణంలోని సీతా స్వయంవర సన్నివేశం చిత్రీకరించబడింది. విల్లు విరిచి పరశురాముడు పాత్రధారి ప్రజాపతి పెద్దగా అరిచాడు. విల్లు ఎవరు విరిచారు త్వరగా చెప్పండి!" అని అంటూనే వేదికపై కుప్పకూలిపోయాడు. తోటి కళాకారులు మొదట్లో నాటకంలో ఒక భాగమని భావించారు, కానీ అతడు ఎంతకీ లేవకపోయేసరికి అనుమానం వచ్చి కదిలించారు. కానీ అతడు కదలలేదు.. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడి ఊపిరి ఆగిపోయింది.
ఈ ఘటన తర్వాత రామ్‌లీలా ఈవెంట్‌ను అకస్మాత్తుగా నిలిపివేశారు. ప్రజాపతి మృతి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.