Loan EMIs: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ గవర్నర్ కీలక సంకేతాలు.. తగ్గనున్న ఈఎంఐలు!
రేట్ల కోతతో తగ్గనున్న హోమ్ లోన్ సహా ఇతర ఈఎంఐల భారం
రుణ గ్రహీతలకు త్వరలో శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రెపో రేటు కోతకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కీలక సంకేతాలిచ్చారు.
అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలోనే భవిష్యత్ రేట్ల కోతపై సూచనలు ఇచ్చామని, ఆ తర్వాత వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు కూడా సానుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతం వద్ద రికార్డు కనిష్టానికి చేరడం రేట్ల తగ్గింపునకు మార్గం సుగమం చేస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, వినియోగ వస్తువులపై పన్నుల కోత వంటివి ఇందుకు దోహదపడ్డాయి.
2025 ప్రథమార్ధంలో ఎంపీసీ రెపో రేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి దాన్ని స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల (డిసెంబర్)లో జరగనున్న కమిటీ సమావేశంలో రేట్ల కోతపై తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ వెల్లడించారు.
ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ఒకవేళ డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే అది 5.25 శాతానికి చేరుతుంది. అదే జరిగితే గృహ, వాహన, ఇతర రుణాలపై ఈఎంఐల భారం గణనీయంగా తగ్గుతుంది. ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడులు నాలుగు పాయింట్లు తగ్గి 6.48 శాతానికి చేరాయి.