Al-Waleed bin Khalid Al Saud: 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ 'స్లీపింగ్ ప్రిన్స్' మృతి
దాదాపు 20ఏళ్లుగా కోమాలో ఉండి 36 సంవత్సరాల వయసులో మరణం;
సౌదీ అరేబియా 'స్లీపింగ్ ప్రిన్స్' అని పిలువబడే ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతిచెందారు. దాదాపు రెండు దశాబ్దాలు కోమాలో ఉన్న ఆయన 36 సంవత్సరాల వయసులో మరణించారు. అల్ వలీద్ బిన్ ఖలీద్ మరణాన్ని ఆయన కుటుంబం ధ్రువీకరించింది.
"అల్లాహ్ ఆజ్ఞ.. తీవ్ర విచారం, దుఃఖంతో నిండిన హృదయాలతో మేము మా ప్రియమైన కుమారుడు ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ ఈరోజు మరణించాడని తెలియజేస్తున్నాం. అతనిని అల్లాహ్ కరుణించుగాక" అని అతని తండ్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.రియాద్‌లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో అసర్ ప్రార్థన తర్వాత ఆదివారం అంత్యక్రియల ప్రార్థనలు జరగనున్నాయని కుటుంబం ప్రకటించింది.
ప్రిన్స్ అల్-వలీద్ సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు రాజు అబ్దులాజీజ్ మునిమనవడు. ఆయన తండ్రి, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్.. రాజు అబ్దులాజీజ్ కుమారుడు ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ కుమారుడు. యువరాజు అల్-వలీద్ సౌదీ రాజకుటుంబానికి బంధువు. అయితే, ఆయన ప్రస్తుత రాజుకు ప్రత్యక్ష వారసుడు కాదు.
ప్రిన్స్ అల్-వలీద్‌కు ఏమైంది..?
ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ లండన్ లో చదువుతున్నప్పుడు కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ సమయంలో అతని మెదడుకు గాయమైంది. 2005లో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 15యేళ్లు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు. అతన్ని రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీకి తీసుకెళ్లి వెంటిలేటర్ పై ఉంచారు. అతని కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులను రప్పించి కోమా నుంచి ప్రిన్స్‌ను బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ప్రిన్స్ కోమా నుంచి బయటకు రాలేదు. దీంతో అతను ప్రపంచ వ్యాప్తంగా ‘స్లీపింగ్ ప్రిన్స్’ గా పేరుపొందాడు.
2019లో శరీర కదలికలు కనిపించినా.. :
ప్రిన్స్ అల్ -వలీద్ కోమాలోకి వెళ్లిన నాటినుంచి పలుసార్లు అతనిలో కదలికలు కనిపించాయి. చివరిసారిగా 2019లో ప్రిన్స్ శరీరంలో కదలికలు మొదలయ్యాయి. ఆయన చిన్న సైగలతో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన వేలు పైకెత్తి తల కొద్దిగా ఊపాడు. కానీ, ప్రిన్స్ స్పృహలోకి వచ్చినందుకు సంకేతం కాదని వైద్యులు చెప్పారు. ఆ తరువాత కూడా అనేక మంది వైద్య నిపుణులు ప్రిన్స్ అల్-వలీద్ ను పరీక్షించారు. కానీ, కోమా నుంచి ప్రిన్స్ బయటపడలేదు. 20యేళ్ల కోమా అనంతరం శనివారం ఆయన తుదిశ్వాస విడిచాడు.