France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను
గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన సెబాస్టియన్ లెకోర్ను
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న సెబాస్టియన్‌ను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించారు. ఫ్రాంకోయిస్ బేరో ప్రధాని పదవికి రాజీనామా చేయగానే.. సెబాస్టియన్ లెకోర్నును ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నియమించారు.
జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఫ్రాంకోయిస్ బేరో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రధాని పదవికి ఫ్రాంకోయిస్ బేరో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో సెబాస్టియన్ లెకోర్ను కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఈయనపై చాలా బాధ్యతలు ఉన్నాయి. విభజించబడిన పార్లమెంట్‌ను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో 2026 బడ్జెట్‌ను సెబాస్టియన్ లెకోర్ను ఆమోదించాల్సి అవసరం ఉంది. కొత్త ప్రధాని ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు నడిపిస్తే బాగానే ఉంటుంది. లేదంటే ఇప్పటికే రెండేళ్లకే ఇద్దరు ప్రధానులు మారారు. సరిగ్గా చేయకపోతే లెకోర్నుకు కూడా ఇబ్బందులు తప్పవు.
సెబాస్టియన్ లెకోర్ను
ఫ్రెంచ్ చరిత్రలోనే 39 ఏళ్ల అతి పిన్న వయసులో సెబాస్టియన్ లెకోర్ను రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో మూడో ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఇక లెకోర్నుకి జాతీయ సంక్షోభాల సమయంలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే తదుపరి ప్రధాని లెకోర్నును మాక్రాన్ నియమించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం లెకోర్ను ముందున్న కర్తవ్యం. అంతేకాకుండా అంతర్జాతీయంగా పొత్తుల విషయంలో కూడా ఫ్రెంచ్ ఇబ్బందులు పడుతోంది. వీటిన్నంటిని ఎదుర్కొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత లెకోర్నుపైనే ఉంది.