Defamation case: ఈ నెల 21 రాహుల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
మోదీ ఇంటి పేరు కేసులో 21న సుప్రీంకోర్టు విచారణ..... అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తి ధర్మాసనం అంగీకారం;
మోదీ ఇంటిపేరు కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ(Congress leader Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు( Supreme Court) ఈనెల 21న(July 21) విచారించనుంది.పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం జులై 21న విచారణ జరుపుతామని తెలిపింది.
2019లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ పరువు నష్టం(Modi' surname defamation case) కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు 2023 మార్చి 23న తీర్పు చెప్పింది, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దోషిగా నిర్థరణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆయన వయానాడ్ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది.
ఈ కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు కూడా పరువునష్టం కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాహుల్ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది. వీర్ సావర్కర్ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసింది. ఆయనపై ఎనిమిది క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదై, విచారణలో ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఆయనను దోషిగా నిర్థరిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని, ఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. అనంతరం గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నెల 21న రాహుల్ పరువు నష్టం పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.