SC: రేపే కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు

కేజ్రీవాల్‌ పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు

Update: 2024-05-09 02:00 GMT

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై మే 10వ తేదీన ఆదేశాలను వెలువరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామని తెలిపింది. ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, అరెస్టు పిటిషన్‌పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిగణిస్తామని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే నిన్న దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకవేళ, ఈ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది.

మరో దర్యాప్తు

కేజ్రీవాల్‌పై మరో దర్యాప్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఖలిస్థానీ అనుకూల గ్రూపు ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి ఆప్‌ నిధులను స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. ఈ అంశంపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని ఆయన సిఫార్స్‌ చేశారు. ఈ ఆరోపణలను ఆప్‌ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మరో కుట్రకు తెర లేపారని అభివర్ణించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ప్రకారం వీకే సక్సేనాకు ఆప్‌పై ఫిర్యాదు అందింది. ‘ది వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌’కు చెందిన ఆషూ మోంగియా దీనిని పంపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎల్జీ పంపిన సిఫార్సుల ప్రకారం.. 1993 దిల్లీ పేలుళ్ల నిందితుడు దేవేందర్‌ పాల్‌ భుల్లర్‌ను విడిపించేందుకు సాయం చేయడం కోసం, ఖలిస్థానీ అనుకూల భావాలను సమర్థించేందుకు 16 మిలియన్‌ డాలర్లను ఎస్‌ఎఫ్‌జే నుంచి ఆప్‌ అందుకొన్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీనికి ఫిర్యాదుదారులు ఎలక్ట్రానిక్‌ ఆధారాలను కూడా జోడించారన్నారు. వీటిపై ఫోరెన్సిక్‌ పరీక్షలు సహా దర్యాప్తు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇక 2014 జనవరిలో కేజ్రీవాల్‌ నుంచి ఇక్బాల్‌ సింగ్‌కు వెళ్లిన లేఖను కూడా దీనిలో ప్రస్తావించారు. ‘‘ఇప్పటికే ఆప్‌ ప్రభుత్వం ప్రొఫెసర్‌ భుల్లర్‌ను విడుదల చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది’’ అన్న విషయాన్ని వెల్లడించారు. గవర్నర్‌ తన ఫిర్యాదుకు ఎస్‌ఎఫ్‌జే ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై ఇటీవల కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణల వీడియోను జోడించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్స్‌ చేయడంపై ఆప్‌ స్పందించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా బీజేపీ ఏజెంట్‌ అని.. ఢిల్లీలో ఏడు సీట్లను ఆ పార్టీ ఓడిపోబోతోందని... అందుకే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తెరతీసిన మరో కుట్ర ఇదని ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News