Boat: గుజరాత్ లో విషాదం... పడవ బోల్తా.. 18 మంది మృతి
16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల మృతి;
గుజరాత్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పిక్నిక్ కు వెళ్లిన 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వడోదరలోని హరిణి సరస్సులో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 27 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
వడోదరకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను హరిణి సరస్సు వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లింది. విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు. వారితో పాటే ఉపాధ్యాయులు కూడా ఎక్కారు. పడవ సరస్సులో కొంతదూరం వెళ్లగానే తిరగబడింది. ఆ సమయంలో పడవలో 27 మంది ఉన్నారు. వారిలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. మధ్యాహ్న సమయంలో హర్ని సరస్సులో ఓ పడవలో వెలుతుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 10 మందికి పైగా విద్యార్థులను కాపాడారు. గల్లంతైన మిగిలిన విద్యార్థుల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, పడవలో ఎక్కినవారికి లైఫ్ జాకెట్లు కూడా లేవని తెలుస్తోంది.మరణించిన 14 మందిలో 12 మంది విద్యార్థులు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుజరాత్ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వడోదర బయలు దేరారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.