Priyanka Chaturvedi: ఆమె అందం చూసే ఎంపీ పదవి ఇచ్చారు..! ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య
దుమారం రేపుతున్న ప్రియాంక చతుర్వేది అందంపై వ్యాఖ్యలు;
శివ సేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (యుబిటి) ఎమ్మెల్యే ప్రియాంక చతుర్వేదిపై , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెకు రాజ్యసభలో స్థానం ఇచ్చారంటూ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ అన్న మాటపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. తను ఎలా ఉన్నానో , ఎలా ఉండాలో ఎదుటివాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారి హుందాతనాన్ని దిగజార్చేలా ప్రయత్నాలు చేయటం సరి కాదంటూ ఘాటుగా ట్విట్ చేశారు.
తన ఆత్మను అమ్ముకున్న ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయాలు, మహిళలపై తనకున్న పాడుబుద్ధిని శిర్సత్ బయటపెట్టేసుకున్నారని అన్నారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న మనుషులు ఏ విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు అన్నది తనకు అర్థం కావట్లేదు అన్నారు. అయితే ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలే ఇప్పుడు తను రిపీట్ చేశానని సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరారు.