Taj Mahal: తాజ్ మహల్ దగ్గర భద్రతా లోపం..
వెలుగులోకి షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియోలు;
తాజ్ మహల్.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. దీన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 17వ శతాబ్దపు నాటి వారసత్వ సంపదను అధికారులు భద్రంగా కాపాడుతున్నారు. ఇక తాజ్ మహల్‌ను బయట నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. లోపల నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అలాంటిది నిషేధిత ప్రాంతంలో ఉన్న షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చక్కర్లు కొట్టడంతో వారసత్వ నిపుణులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు స్మారక చిహ్న సంరక్షణకు హాని కలిగిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
భారత పురావస్తు సర్వే సంస్థకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చే పెట్టేది తాజ్ మహలే. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఐదేళ్ల కాలంలో టికెట్ల రూపంలో రూ.297 కోట్లు వచ్చాయి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోటను అధిగమించి ఆదాయం వచ్చింది.
అయితే ఈ వారసత్వ సంపదను చాలా భద్రంగా కాపాడుతున్నారు. తాజ్ మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉంటాయి. వాటి లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. అలాంటిది వాటికి సంబంధించి వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇక ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. అంతేకాకుండా అనేక కామెంట్లు కూడా పెడుతున్నారు. నిషేధిత ప్రాంతంలోకి ఆ వ్యక్తి ఎలా ప్రవేశించాడంటూ ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను 1994-95 ప్రాంతంలో తాజ్ మహల్‌ను సందర్శించాను. ఆ సమయంలో ప్రజలకు తెరిచి ఉండేది’’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘‘నేను కూడా దీన్ని గతంలో చూశాను.’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
భద్రతా సమస్యలు తలెత్తడంతో స్మారక చిహ్నం దగ్గర యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తాజ్ సెక్యూరిటీ) సయ్యద్ అరిబ్ అహ్మద్ ప్రకటించారు. ఈ వ్యవస్థ ప్రధాన గోపురం నుంచి 200 మీటర్లలో డ్రోన్ సిగ్నల్‌లను జామ్ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీసులచే కాపలాగా ఉన్న ప్రదేశానికి కొత్త రక్షణగా ఉండనుంది.