Delhi Blast : నగదు చెల్లించి బ్రెజా కారు కొనుగోలు చేసిన షాహీన్, ముజమ్మిల్
షాహీన్, ముజమ్మిల్ ఫొటో వెలుగులోకి
ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో డాక్టర్ షాహీన్, ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వారికి సంబంధించిన ఓ కొత్త ఫొటో తాజాగా బయటకు వచ్చింది.
వీరిద్దరూ కలిసి ఓ కారును కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 25న ఒక షోరూమ్‌లో మారుతి సుజుకి బ్రెజా కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ సమయంలో వారు మొత్తం నగదు రూపంలో చెల్లించి కారును తీసుకెళ్లినట్లు బయటపడింది. పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్న 32 కార్లలో ఇది కూడా ఒకటని దర్యాప్తు అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
కాగా, డిసెంబర్ 6న ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. మొత్తం 32 వాహనాల్లో పేలుడు పదార్థాలను నింపాలని అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేషన్లలో పేలుడుకు పాల్పడాలని భావించినట్లు తెలుస్తున్నది. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసేందుకు వైట్‌కాలర్ డాక్టర్లు సుమారు 26 లక్షల నిధి సేకరించినట్లు తేలింది.
ఇక ఉగ్ర డాక్టర్లంతా కోడ్ భాష ఉపయోగించేవారు. ‘ఔషధం’, ‘ఆపరేషన్’ అనే కోడ్ భాషను ఉపయోగించారు. ఇక షాహీన్ ఓ వైపు ఉగ్ర దాడులకు కుట్ర చేస్తూనే.. ఇంకోవైపు మానవ బాంబర్ల కోసం యువతల కోసం చురుకుగా పని చేసినట్లుగా కనిపెట్టారు. ఇక ఢిల్లీ బ్లాస్ట్‌లో డాక్టర్ ఉమర్‌కు సహకరించిన కీలక సహ కుట్రదారుడు డానిష్‌ను శ్రీనగర్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్‌లో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు.