రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. శక్తికాంత దాస్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం. A+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల జాబితాలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరిలో డెన్మార్క్‌కి చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్‌సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్ ఉన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండవ సంవత్సరం A+ గ్రేడ్ అవార్డును అందుకున్నారని ఆర్బీఐ ‘ఎక్స్’లో పేర్కొంది. యూఎస్‌లోని వాషింగ్టన్ డీసీలో శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును అందించింది. సంక్లిష్ట ఆర్థిక సవాళ్లలో భారతదేశ అపెక్స్ బ్యాంక్‌ను నడిపించడంలో గవర్నర్ శక్తికాంత దాస్ అద్భుతమైన పనితీరు, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ సంస్థ గుర్తించింది.