బహిష్కరణకు గురైన వ్యక్తి దేశానికి హోంమంత్రిగా ఉండడం విచిత్రమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. దేశంలోనే అవినీతిపరుడంటూ అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. గతంలో ఓ కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు బహిష్కరించిందన్నారు. దేశం ఎటువంటి వారి చేతితో ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పారు. ‘కొన్ని రోజుల క్రితం అమిత్ షా నాపై అవినీతి ఆరోపణలు చేశారు. అవన్నీ అసత్యాలే. షానే గతంలో చట్టాన్ని దుర్వినియోగం చేశారు. అందుకే సుప్రీం కోర్టు గుజరాత్ నుంచి రెండేళ్లు బహిష్కరించింది. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదు. దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలి’ అని శరద్ పవార్ అన్నారు