Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్‌పై థరూర్ కీలక వ్యాఖ్యలు

"మాట తప్పడం వారి నైజం"-థరూర్ కవితలో వ్యంగ్య వ్యాఖ్యలు;

Update: 2025-05-11 02:15 GMT

"మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?" అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం పాకిస్థాన్‌పై తనదైన శైలిలో కవితాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని భారత్, పాకిస్థాన్ అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని, దానికి భారత సాయుధ బలగాలు తగిన రీతిలో జవాబిచ్చాయని భారత్ శనివారం రాత్రి ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్, శనివారం రాత్రి పొద్దుపోయాక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక హిందీ ద్విపదను పోస్ట్ చేశారు. "ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?" (#ceasefireviolated అనే హ్యాష్‌ట్యాగ్‌తో) అని పేర్కొన్నారు. "మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?" అని దీనికి అర్థం.

అంతకుముందు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, శాంతి అత్యవసరమని థరూర్ అభిప్రాయపడ్డారు. "నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు, కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను," అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం ప్రారంభించిన "ఆపరేషన్ సిందూర్"ను ఆయన ప్రస్తావించారు.

Tags:    

Similar News