Everest: 31వ సారి ఎవరెస్టును అధిరోహించి రికార్డు
తన రికార్డు తానే బద్దలు కొట్టిన నేపాల్ ‘ఎవరెస్ట్ మ్యాన్’ కమి రిటా;
ప్రఖ్యాత నేపాల్ షెర్పాగైడ్ కామీ రీటా(55) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 31వసారి అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. 8,849 మీటర్ల ఎత్తున్న శిఖరాగ్రాన్ని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కామీ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించి మరెవరూ చేరుకోలేని ఘనత సాధించారని కొనియాడారు. గత రెండేళ్లలో కామీ రీటా నాలుగు సార్లు ఎవరెస్టును అధిరోహించడం విశేషం.
ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఎవరెస్టు శిఖరాన్ని మొదటిసారి విజయవంతంగా అధిరోహించినందుకు గుర్తుగా నేపాల్‌లో గురువారం 100మంది పర్వతారోహకులను సత్కరించారు. వీరిలో 10మంది భారతీయులున్నారు. ఏటా మే 29న ‘ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే’ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కాఠ్‌మాండూలో జరిగిన కార్యక్రమంలో నేపాల్ పర్యాటక మంత్రి బద్రి పాండే పర్వతారోహకులను సన్మానించారు.