Maharashtra: డ్రైవర్‌కు రూ.150 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చిన ఎంపీ..

రంగంలోకి దిగిన అధికారులు!;

Update: 2025-06-28 06:45 GMT

ఎంత అభిమానం ఉన్నా.. లేదంటే ఎంత ప్రేమ ఉన్నా.. రక్తసంబంధులైనా ఏదో కొంత సాయం చేయడమో.. గిఫ్ట్‌గా ఇవ్వడమో చేస్తుంటారు. అంతేకానీ కోట్లకు కోట్ల ఆస్తులైతే ఇవ్వరు కదా? కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక ఎంపీ ఏకంగా తన కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. అతడు రక్తసంబంధి కాదు.. బంధువు కాదు.. అయినా కూడా అన్ని కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఎలా ఇచ్చారంటూ తీవ్ర చర్చనీయాంశమైంది. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన ఎంపీ సందీప్‌ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్‌ దగ్గర జావెద్‌ రసూల్‌ షేక్‌ అనే వ్యక్తి 13 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న హైదరాబాద్ నిజాం దివాన్‌ వారసులకు చెందిన రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గిఫ్ట్‌గా రాసిచ్చేశారు. దీనిపై న్యాయవాది ముజాహిద్‌ ఖాన్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై దివాన్‌ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్‌ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్‌గా ఎలా ఇస్తారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

నిజాం దివాన్‌ వారసులతో తనకు సత్ససంబంధాలు ఉన్నాయని.. ఆ కుటుంబంతో బాగా పరిచయం కూడా ఉందని డ్రైవర్ జావెద్‌ రసూల్‌ షేక్‌ తెలిపాడు. అందుచేతనే ఆ భూమిని తనకు ఎంపీ గారు బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణంలో డ్రైవర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించినట్లు ఎమ్మెల్యే విలాస్ భూమ్రే అంగీకరించారు. పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. డ్రైవర్‌తో ఎన్నేళ్లుగా పరిచయం ఉందని అడిగారని.. భూమి బదిలీ గురించి కూడా వాకబు చేసినట్లు చెప్పారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర లేవనట్లుగా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News