National medical commission: వైద్య కాలేజీలకు షాక్
ప్రమాణాలు లేకుంటే అనుమతులు రద్దు;
చట్టపరమైన నిబంధనలు, జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలను ఖాతరు చేయని వైద్య కళాశాలలకు ప్రతి ఉల్లంఘనకు రూ.కోటి జరిమానా విధించనున్నారు. కళాశాల, రోగుల రికార్డులు సహా తప్పుడు డిక్లరేషన్లు, డాక్యుమెంట్లను సమర్పించే ఫ్యాకల్టీ, విభాగాధిపతి, డీన్, డైరెక్టర్, వైద్యులకు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. వారిపై దుష్ప్రవర్తన కింద విచారణకు కూడా ఆదేశించవచ్చు. ఈమేరకు వైద్య విద్య, వృత్తిపై ఎన్‌ఎంసీ రూపొందించిన కొత్త నిబంధనలను సెప్టెంబరు 27న నోటిఫై చేశారు. ‘‘ఏదైనా వైద్య కళాశాల చట్టపరమైన నిబంధనలు, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే దాని అనుమతిని అయిదేళ్ల వరకు ఆపేయవచ్చు. అక్రిడిటేషన్‌ను సైతం వెనక్కి తీసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డ్(యూజీఎంఈబీ), పోస్ట్ గ్యాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డు(పీజీఎంఈబీ) వంటి పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులు, సంస్థల దరఖాస్తులు, అర్జీలను వెంటనే నిలిపేస్తారు
సంబంధిత అన్ని పరీక్షల నియమ, నిబంధనలను పాటిస్తున్నట్లు ప్రతి వైద్య కళాశాల ఏడాది చివర్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులు, వారికి సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది, వైద్యులు, వసతులు, అన్ని రకాల వ్యాధుల చికిత్సపై అవగాహన కల్పించడానికి సరిపడా రోగులు, రోగ నిర్ధారణ సౌకర్యాలు ఇలా ప్రతి ఒక్కటి ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు ఉండాల్సిందే. ఎక్కడ అతిక్రమణలు కనిపించినా జరిమానా విధించడానికి తొలుత నోటీసులు జారీ అవుతాయి. అలాగే కొత్త కోర్సులు, వైద్య సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ)ని ఏర్పాటు చేశాం’’ అని నిబంధనల్లో వెల్లడించారు.
మొత్తానికి ప్రమాణాలు పాటించని వైద్య కళాశాలలపై ఎన్‌ఎంసీ కఠినంగా వ్యవహరించబోతోందన్న విషయం తాజా మార్గదర్శకాలతో తేటతేల్లమవుతోంది. వాటిలో మరికొన్ని ముఖ్యమైనవి. మెడికల్ కాలేజీ డైరెక్టర్ లేదా ఎవరైనా విభాగాధిపతి సమర్పించే ధ్రువపత్రాలు తప్పుడువని తేలితే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.గుర్తింపు ప్రక్రియను నిలిపివేస్తారు. కొత్త కోర్సులు, సీట్ల పెంపు కోసం చేసుకున్న దరఖాస్తును పక్కన పెట్టేస్తారు. ఆ విద్యా సంవత్సరంతో పాటు తదుపరి ఏడాది కూడా సీట్ల సంఖ్యలో కోత విధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తారు. కొన్నిసార్లు ఐదేళ్ల పాటు సదరు కాలేజీ గుర్తింపును నిలిపివేయడమో, రద్దు చేయడమో చేస్తారు. తప్పుడు సమాచారం, తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్లు నిర్ధారణ అయితే ఆ కాలేజీలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.