Sabarimala Missing Gold: బళ్లారిలో శబరిమల బంగారం ప్రధాన నిందితుడి ఫ్రెండ్ షాపులో
బళ్లారిలో 400 గ్రాముల కడ్డీలు గుర్తింపు
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి చెందిన బంగారు దోపిడీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలనాత్మక పురోగతి సాధించింది. ఆలయం నుంచి దొంగిలించబడిన బంగారంలో గణనీయమైన భాగాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఉన్న ఒక జ్యువెల్లరీ దుకాణం నుంచి సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి.. తాను దొంగిలించిన బంగారాన్ని తన సహచరుడైన గోవర్ధన్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అధికారులు గుర్తించారు. ఎస్పీ శశిధరన్ నేతృత్వంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ బంగారం పట్టుబడింది. గోవర్ధన్ ఆభరణాల దుకాణం నుంచి దర్యాప్తు బృందం 400 గ్రాములకు పైగా బంగారాన్ని రికవరీ చేసింది.
ఇదే సమయంలో తిరువనంతపురంలోని పులిమత్‌లో ఉన్న పొట్టి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులకు.. అక్కడ పెద్ద ఎత్తున బంగారు నాణేలు, రూ.2 లక్షల నగదు కనిపించింది. దాన్ని సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి.. అక్టోబర్ 30 వరకు రిమాండ్‌లోనే ఉండబోతున్నారు. ఈక్రమంలోనే అధికారులు అతడి నుంచి కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఈ దొంగతనం జరిగిన తీరు, నిందితులు బంగారాన్ని తరలించిన విధానంపై ప్రత్యేక దృష్టి సారించి.. ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చిన వాంగ్మూలాలను ధృవీకరించుకోవడానికి బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని అనేక ప్రాంతాలను అధికారులు సందర్శించారు.
శనివారం ఉదయం ముగ్గురు సభ్యుల సిట్ బృందం పొట్టితో కలిసి దర్యాప్తులో భాగంగా బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ దాడుల్లో పొట్టి నివాసం, బంగారం విక్రయించిన బళ్లారి ప్రాంతం, అలాగే ఆలయ గర్భగుడి తలుపుల మరమ్మతు చేసిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ, శబరిమల ఆలయానికి బంగారు పూత సామగ్రిని సరఫరా చేసిన చెన్నైకి చెందిన 'స్మార్ట్ క్రియేషన్స్' అనే సంస్థలపై అధికారులు తనిఖీలు చేశారు. ఆలయ పనుల కోసం వినియోగించాల్సిన బంగారం మొత్తంలో ఎంత భాగం దారి మళ్లిందో తెలుసుకోవడానికి, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న బంగారపు పరిమాణం సరిపోలుతుందో లేదో అని సిట్ బృందం పరిశీలిస్తోంది. గతంలో ఆలయ గర్భగుడి ప్యానెళ్లకు బంగారు పూత పనులకు గోవర్ధన్ కూడా సహకరించినందున.. అతని పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు జరుగుతోంది.