Rahul Gandhi flying kiss: మరో వివాదంలో రాహుల్ గాంధీ
సభ గౌరవాన్ని దిగజార్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఫైర్ అయ్యారు.;
రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి... రాహుల్‌గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన రాహుల్.. ఆ తర్వాత పార్లమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో స్మృతి ఇరానీ వైపు చూస్తూ రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు.
రాహుల్‌గాంధీపై బీజేపీ మహిళా ఎంపీలు చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె పట్ల రాహుల్ అసభ్యకరంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ అనుచిత ప్రవర్తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే. బీజేపీ మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందజేశారు. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రాహుల్ సభలో మహిళా సభ్యులను అవమానించారని.. సభ గౌరవాన్ని దిగజార్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఫైర్ అయ్యారు.
రాహుల్‌గాంధీ తీరుపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నారు. రాహుల్ మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోందన్నారు. ఇది అసభ్యకరమైనదంటూ మండిపడ్డారు.