Indo-Pak border: నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కాల్పులు.. భార‌త జ‌వాను మృతి

ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందని ఆర్మీ ప్రకటన;

Update: 2025-08-13 05:45 GMT

జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.

ఆగస్టు 12న చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇది సాధారణ చొరబాటు ప్రయత్నానికి భిన్నంగా ఉందని పేర్కొన్నాయి. చొరబాటుదారులకు పాకిస్థాన్ సైన్యం నుంచి మద్దతు లభించిందని.. వారి నుంచి కాల్పుల మద్దతు కూడా లభించిందని వెల్లడించాయి. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ మద్దతుతోనే ఈ చొరబాటు జరిగిందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బోర్డర్‌లో ఇంత స్థాయిలో అలజడి సృష్టించడం ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల జోలికొస్తే అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమది అణ్వాయుధ దేశం అని.. తాము నాశనం అవుతున్నామంటే.. అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. గతంలో ఇలా రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇప్పుడు మరోసారి బోర్డర్‌లో అలజడి మొదలైంది.

Tags:    

Similar News