Sonia Gandhi: సోనియా గాంధీ విచారణ విషయంలో మనసు మార్చుకున్న ఈడీ..
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ తదుపరి విచారణ తేదీలో మార్పులు చేసింది ఎన్‌ఫోర్సు డైరెక్టరేట్.;
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తదుపరి విచారణ తేదీలో మార్పులు చేసింది ఎన్‌ఫోర్సు డైరెక్టరేట్. జులై 25కు బదులుగా 26న విచారణకు రావాల్సిందిగా కోరింది. ఐతే తేదీ మార్పు వెనుక స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు ఈడీ. ఐతే ఈ అంశంపై స్పందించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కే.సి.వేణుగోపాల్. మొదట సోమవారం విచారణకు హాజరు కావాలని కోరారని.. తర్వాత మంగళవారం విచారణకు రమ్మంటున్నారని చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో గురువారం మూడు గంటల పాటు సోనియా గాంధీని విచారించింది ఎన్‌ఫోర్సు డైరెక్టరేట్. దాదాపు 25 ప్రశ్నలు అధికారులు సోనియాను అడిగినట్లు సమాచారం. ఐతే ఆరోగ్య కారణాల కారణంగా సోనియా చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధికారులు.. విచారణను త్వరగా ముగించారు. సోనియా వెంట ఈడీ ఆఫీసుకు ప్రియాంక గాంధీ సైతం వచ్చారు.
ఐతే సోనియాకు మద్దతుగా గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కేనాన్స్ ఉపయోగించారు.CWC సభ్యులను, కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. సోనియాకు ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. డీఎంకే,శివసేన, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం సహా మొత్తం 13 పార్టీలు సోనియాకు మద్దతు పలికారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయిగా ఉన్న 90 కోట్ల 25 లక్షల రూపాయలను వసూలు చేసుకునేందుకు ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కుట్ర పన్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెడిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు.