Udhayanidhi Stalin: బాలీవుడ్పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్

భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకమన్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి;

Update: 2024-11-03 05:30 GMT

బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రాంతీయ భాషల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని పేర్కొన్న ఆయన .. దాన్ని బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బలవంతంగా భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవే ద్రవిడ ఉద్యమాలు అని చెప్పారు.

దక్షిణాది తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు లేకపోవడం పెద్ద మైనస్‌గా పేర్కొన్నారు. ఒక వేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోలేకపోతే హిందీ ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని అన్నారు. జాతీయవాదం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి వంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతం చేశారని అందుకే వారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని అన్నారు.

హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇప్పటికీ హిందీని బలవంతంగా రుద్దేందుకు జాతీయవాదులు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భాషలను, సంస్కృతిని రక్షించుకోవడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఉదయనిధి అన్నారు.   

Tags:    

Similar News