Shubhanshu Shukla: నేడు ప్రధానితో భేటీ కానున్న స్పేస్ హీరో
ఈ సాయంత్రం మోదీతో వ్యోమగామి శుభాంశు శుక్లా సమావేశం;
అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఈ సమావేశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఏడాది పాటు అమెరికాలో శిక్షణ పొంది, అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభాంశు శుక్లా నిన్న భారత్‌కు తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు కుటుంబ సభ్యులు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు.
జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన యాక్సియమ్-4 మిషన్‌లో శుక్లా పైలట్‌గా వ్యవహరించారు. జూన్ 26న వారి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైంది. అప్పట్లో ఆయన అంతరిక్షం నుంచే ప్రధాని మోదీతో మాట్లాడారు. ఆ సందర్భంగా, తన శిక్షణ, అంతరిక్షంలో బస, నేర్చుకున్న విషయాలను భవిష్యత్ మిషన్ల కోసం డాక్యుమెంట్ చేయాలని శుక్లాను ప్రధాని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ.. శుభాంశు శుక్లా గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
భారత్‌కు తిరిగి వచ్చే ముందు శుభాంశు శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. "భారత్‌కు తిరిగి వస్తుండగా నా మనసులో మిశ్రమ భావాలు ఉన్నాయి. ఏడాది పాటు స్నేహితులుగా, కుటుంబంలా ఉన్న వారిని విడిచి వస్తున్నందుకు బాధగా ఉంది. అదే సమయంలో, మిషన్ తర్వాత మొదటిసారిగా నా కుటుంబ సభ్యులను, స్నేహితులను, దేశ ప్రజలను కలవబోతున్నందుకు ఉత్సాహంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. 'స్వదేశ్' సినిమాలోని 'యూహీ చలా చల్' పాటలోని ఒక పంక్తితో ఆయన తన పోస్ట్‌ను ముగించారు. యాక్సియమ్-4 మిషన్ ప్రారంభం రోజున కూడా ఆయన ఇదే పాటను ఎంచుకోవడం విశేషం.